2008 లో అనగనగా ఒక నేను మద్రాసు లో వచ్చి పడ్డాను. ఈ మూడేళ్ళలో సంవత్సరానికి 10 చొప్పున 20 ఎండాకాలాలు చూసాను. మార్చ్, ఏప్రెల్, మే నెలలలో ఎవరైనా మద్రాసు కు పెళ్ళికో , బంధువుల ఇంటికో వచ్చారంటే సిక్కిం బంపర్ లాటరీ కొట్టినట్టే. దగ్గర్దగ్గిర 180 డిగ్రీ సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతతో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది వాతావరణం.
అసలు మాటర్ ఏంటంటే .....'Big Bang' జరిగిన తరువాత మన విశ్వం లో అన్నీ చల్లబడి సర్దుకుంటున్న టైములో 'Small Bang' అనే చిన్న విస్పోటం ఇంకోటి జరిగింది. ఆ నిప్పు రేణువులు పడటం వల్ల మన విశ్వం లో కొన్ని ప్రాంతాలు మాత్రమే వేడిగా అలా ఉండిపొయ్యాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగినవి సూర్యుడు, సహారా ఎడారి , మద్రాసు...
ఇప్పటి వాళ్ళ లాగానే రాతియుగం నాటి మద్రాసు వాస్తవ్యులు కూడా కోతి నాయాళ్ళు . తంగ వేల్ , శరవణ వేల్, బొటన వేల్, చిటికెన వేల్ అనే నలుగురు అన్నదమ్ములు దోమలు ఎక్కువగా కుడుతున్నాయని ఓజోన్ పొర ను చించి దోమతెరలు కుట్టుకున్నారంట. దాని ఫలితం ఇప్పటి జనాలు అనుభవిస్తున్నారు .
వీళ్ళకంటే అలవాటైపొయ్యింది....తలరాత తమిళ దేవుడు రాసి మద్రాసు లో ఉద్యోగం వచ్చిన నాలాంటి వాళ్ళ సంగతి ఏంటి ??
'మద్రాసు ' ను ' చెన్నై' అని పేరు మారిస్తే పరిస్థితి మారుతుందేమో అని ప్రయత్నించారు . అసలుకే మోసం వచ్చి ఎండ మూడింతలయ్యింది. ఆ వేడికి బుర్ర బాయిలింగ్ పాయింట్ దాటి ...మామూలు మనుష్యుల్లాగా అలోచించే శక్తి కోల్పొయ్యి, ఏమి చెయ్యాలో తోచని వాళ్ళు రాజకీయాల్లోకి ప్రవేశించి.. ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు అయ్యారు (మీరుగానీ నేను కరుణానిధి, జయలలిత గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా ??? ఐతే మీకు వంద మార్కులు ...నేను వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను ).
మా ఆఫీసు లో ఫార్మల్ వేర్ తప్పనిసరి ....మార్చ్ , ఏప్రెల్, మే నెలల్లో మేము పడే కష్టాలు గమనించి మానేజ్మెంట్ వాళ్ళు అందరికీ మెయిల్ చేసారు - "మీకు ఏ డ్రస్సు సౌకర్యంగా ఉంటే అదే వేుకురండి" అని....మరుసటి రోజు అందరూ నిక్కర్లూ, బనియన్లూ వేసుకుని తయారయ్యారు..
కాసిన్ని వానలు పడితే ఐనా భూమి కాస్త చల్లబడుతుంది ...కానీ అదంత వీజీ కాదు ..
ఉన్న కొండలన్నీ పగలగొట్టి KPJ లక్కీ స్టోన్స్ వాళ్ళు ఉంగరాల్లో పెట్టి అమ్మటం మొదలు పెట్టారు ..అశోకుడు మద్రాసు లో కూడా రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటించాడంట . కానీ ఇక్కడ టీ కొట్లనుంచి కార్ షోరూముల దాకా చెట్లు కొట్టేసి, ఫూట్పాత్లు చెరిపేసి కట్టిన ఇల్లీగల్ కట్టడాలు చాలా ఉన్నాయి...ఇప్పుడు మద్రాసు మొత్తానికి 13 చెట్లు మిగిలున్నాయి - అందులోవి ఆరు గులాబీ మొక్కలు...
కొండలూ, చెట్లు ఏమీ లేకపోతే వర్షాలు ఎక్కడినుండి పడతాయి??
అలాగని అస్సలు వర్షాలే ఉండవని కాదు ..అప్పుడప్పుడూ కొన్ని అకాల వర్షాలు పడుతుంటాయి - అది కూడా కేవలం మద్రాసులో ఇండియా క్రికెట్ మాచులు ఉన్నప్పుడు మాత్రమే... ఈ మాట చాలా మంది నమ్మక పోవచ్చు.... కావాలంటే ఈ సారి మనవాళ్ళ మాచ్ ఏదైనా మద్రాసు లో ఉన్నప్పుడు ఇక్కడకు రండి . ఆ రోజు పొద్దున వాన పడే సూచన ఏమాత్రం లేకున్నా సగం మంది గొడుగులు పట్టుకుని కనిపిస్తారు... మిగతా సగం ' అడవి రాముడు ' సినిమాలో వాన పాట డ్రస్సులేసుకుని తిరుగుతుంటారు. మనవాళ్ళు గనక గెలిచే పొజిషన్ లో ఉంటే ఆరోజు మధ్యాన్నానికల్లా తుఫానొచ్చి మద్రాసు చుట్టుపక్కల రెండు మూడు ఊర్లు మునిగిపోతాయి ..
నేను నా స్నేహితులను కలవటానికి సగటున మూడు నెలలకొకసారి బెంగళూరు వెళ్తుంటాను. మద్రాసు నుండి వస్తున్న బస్సు బెంగళూరు ప్రవేశించబోతోంది అనగా ఒక అనౌన్సుమెంటు చేస్తారు - "మద్రాసు నుండి వస్తున్న ప్రజలార...ఇప్పుడు మీరు మీకు తెలియని ఒక కొత్త అనుభూతికి లోనవబోతున్నారు ...దీనిని 'చలి ' అంటారు. సీట్ల కింద దూరడమో , డ్రైవర్ పక్కనున్న ఇంజను మీద కూర్చోవడమో చెయ్యండి...లేకపొతే చచ్చి ఊరుకుంటారు " అని ...
మద్రాసు లోని లోకల్ బొబ్బిలి బ్రహ్మన్న ' చలి ' ని ఎప్పుడో ' గ్రామ బహిష్కరణ ' చేసాడు .. అందుకే ఇక్కడ 'చలికాలం ' అనే మాటకు అర్థం చాలా మందికి తెలియదు ...ఇక్కడ డిసెంబర్, జనవరి నెలల్లో కూడా ఎయిర్ కూలర్ల అమ్మకాలు మాంచి జోరుగా ఉంటాయి...
మూడు నెల్ల క్రితం పేపర్లో వచ్చిన ఒక సంచలన వార్త అందరూ చదివే ఉంటారనుకుంటా - "మద్రాసు లో స్వటర్లు అమ్మటానికి ప్రయత్నించిన దినకర్ అనే వ్యక్తిని పిచ్చాసుపత్రిలో చేర్పించిన పోలీసులు " అని... మొదట్లో ఇదేదో పోలీసులు పన్నిన కుట్ర అనుకున్నారు మిగతా ప్రాంతాల వారు ...కానీ అదే దినకర్ పిచ్చాసుపత్రి నుండి రెలీజ్ అయ్యాక మద్రాసు ఎండలో 'sun bath ' చేద్దామని రెండు చిన్న గుడ్డ పేలికలు కట్టుకుని మరీనా బీచులో పడుకున్నాడంట... ఆ ఫొటోలు పేపర్లో రావటం తో కొంచెం తేడా కాండిడేట్ అని నిర్ధారించుకున్నారు..
గంట సేపుగా కంప్యూటర్ ముందు కూర్చున్నానేమో ...వళ్ళంతా చెమటలు పట్టేసాయి.. ఈ రోజు చెయ్యవలసిన నాలుగో స్నానానికి టైమయ్యింది...
Super.........!
Mana Bhadhalu maname enjoy cheselagunnay mari !!
No comments:
Post a Comment